సంతకానికి ఎంత తీసుకున్నావు?
ఇంతకీ ఈ చంద్రం ఎవరు?
ఫోర్జరీ చేసిన స్టూడియో ఎవరిది?
ఆసక్తికరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయ బాగోతం

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టణంలోని ధర్మకంచ మల్లన్న గుడి సమీపంలో ఉన్న టీఎన్జీవోస్ ప్లాట్ అక్రమ బదిలీ వెనుక సూత్రధారి,పాత్రధారి ఎవరు? అన్న కోణంలో విచారణ చేసేందుకు జిల్లా రిజిస్టార్,విజిలెన్స్, ఇంటలిజెన్స్,రెవెన్యూ అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి చనిపోయిన వారి పేరున ఉన్న ప్రాపర్టీని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా కొట్టేసేందుకు ఈ ముఠా తెరలేపింది. అంతేకాదు,లక్షల విలువైన ఆస్తులను చేతులు మార్చేసింది. ఇప్పుడు ఈ చేతులు మారిన అక్రమ దందాపై అన్ని శాఖల అధికారులు నిఘా పెట్టి ఆ ముఠా ఆట కట్టించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు సోమవారం అక్రమ దందా నిగ్గు తేల్చే పనిలో పడగా ఇతర విభాగాల అధికారులు సైతం ఆ కోణంలో విచారణ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారతి చంద్రయ్య అనే వ్యక్తికి సంబంధించిన సుమారు 200 గజాల ప్లాటు మార్పిడి విషయంలో డూప్లికేట్ చంద్రయ్యగా అవతారం ఎత్తిన వ్యక్తి ఎవరు? ఇందుకోసం ఆధార్ కార్డును ఎక్కడ మార్ఫింగ్ చేయించారు? ఆ డిజిటల్ ఫోటో స్టూడియో ఎవరిది? ఎవరు దీనిని చేయించారు? రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి చంద్రయ్యగా సంతకాలు చేసిన వ్యక్తి ఎవరు? సంతకాలు చేసినందుకు డూప్ ఎంత తీసుకున్నాడు? ఈ డాక్యుమెంట్ రైటర్ ఎవరు? అనే కోణంలో విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. నిజంగా డూప్లికేట్ చంద్రయ్య చేసిన వ్యవహారం అదిరింది..! అన్నట్లుగా సర్వత్రా ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం జనగామ నుండి బదిలీ అయిన సబ్ రిజిస్టర్ కరుణది ఈ దందాలో ఏ మేరకు పాత్ర ఉన్నది? అనే కోణంలో కూడా జిల్లా రిజిస్టార్, రెవెన్యూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖకు ఆధార్ పోర్టల్ లింకు తప్పనిసరిగా ఉంటుంది. అలాంటప్పుడు రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది గానీ, చివరకు సబ్ రిజిస్టర్ కానీ ఆధార్ కార్డుని ఆధార్ పోర్టల్ ఉన్న కార్డుతో ఎందుకు పోల్చి చూడలేదు అనే కోణంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమాలకు అలవాటు పడిన అధికార యంత్రాంగం ఇతరుల ప్రాపర్టీని బదిలీ చేయడం పనిగా పెట్టుకోవడం, దాని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారడం వల్లనే ఇదంతా జరిగిందని అనుమానిస్తున్నారు. నిజానికి ఇది క్షమించరాని నేరం. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించడం అనేది ఫోర్జరీ,420,ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను మ్యాని ప్లేటింగ్ చేసి ఇతరుల ఆస్తులను మోసపూరితంగా కొట్టేయడం అనేది పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇందుకు సహకరించిన అధికారులు,డిజిటల్ స్టూడియో వ్యక్తులది సైతం ఇందులో అంతే ప్రమేయం ఉండడం విస్మయానికి గురిచేస్తుంది. ఇంతటి ఈ ఘనకార్యానికి పాత్ర వహించిన ఆ చంద్రయ్య ఎవరు? ఆయన వెనుకున్నదెవరు? అనే కోణంలో అధికారులు విచారణ చేయాల్సి ఉంది. ఎలాంటి అవకతవకలు,అక్రమాలకు, పైరవీలకు స్థానం లేకుండా పారదర్శకంగా జిల్లాలో పాలన అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇప్పటికే బదిలీల పేరిట ఆయా విభాగాల్లో సంస్కరణలు చేపట్టినప్పటికీ జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు మాత్రం బరితెగించి ఈ దందాకు పూనుకోవడం పట్ల సర్వత్ర పెదవి విరుస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి డూప్లికేట్ చంద్రయ్య, సహా దాని వెనకాల ఉన్న వారి ఆట కట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో దొంగ నోట్లు,స్టాంపుల విషయంలో నకిలీ దందాకు తెరలేపిన కొన్ని నెట్ సెంటర్లు, స్టూడియోలు జిల్లాలో ఉన్నాయి. ఈసారి నకిలీ ఆధార్ కార్డు తయారు చేసిన ప్రబుద్ధుడు ఎవరు? జనగామలో చేపించారా? ఇతర ప్రాంతంలో చేపించారా?ఎవరు చేయించారు? అనే కోణంలో జిల్లా రిజిస్టర్,రెవెన్యూ,పోలీస్ అధికారులు దృష్టి సారించాలని పలువురు అంటున్నారు.డూప్లికేట్ చంద్రయ్య భాగోతం మాత్రమే ఇప్పటికీ బయటపడింది, అయితే, బయటపడనివి ఇంకా ఎన్ని ఉన్నాయో? ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇందులో రఘునాథపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తిది కూడా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఆయా విభాగాల ఉన్నతాధికారులు దృష్టి సారించి డూప్లికేట్ గా నటించి సంతకాలు చేసిన వ్యక్తి ఎవరు? ఫేక్ ఆధార్ కార్డు చేసింది ఎవరు అనేది తక్షణమే గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి ఆయా శాఖల జిల్లా అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుంది అనేది.
