teluguleads.in
Newspaper Banner
Date : 04 July 2026, 12:40 pm Posted By : TELUGU LEADS

ఇదీ రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్ళు. సరిగ్గా ఇదే రోజున అంటే జూలై 4న 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌ మండలం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి అంచలంచలుగా వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధిగా ఎన్నికవుతూ 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. జడ్పిటిసిగా గెలుపొందిన అయన ఏడాది తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని ఎంపీపీలు,జెడ్పిటిసిలు,ఎంపీటీసీలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆయనపై ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పడింది. అయన రేవంత్ రెడ్డిని పిలిచి 2008లో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కల్పించారు. అయితే,ఎమ్మెల్సీ పదవితో తృప్తి చెందని రేవంత్ రెడ్డి 2009లో ఇదే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి శాసనమండలి నుండి శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో కూడా అయన టిడిపి నుండి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే కాదు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా విపక్ష నేతగా పని చేశారు. ఈ సమయంలోనే ఓటుకు నోటు కేసులో అయన అరెస్ట్ కావడం విచారకరం. ఆ తరువాత 2017లో మాజీ ఎంపీ, స్వర్గీయ జయపాల్ రెడ్డి ప్రోత్సాహంతో జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన అయన 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆ వెంటనే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2021లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులై రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ 2023లో తన వాగ్దాటితో ముఖ్యమంత్రిగా అయ్యారు. భార్య గీత, కూతురు నిమిషా రెడ్డి, మనవడు రియాన్స్ ఉన్నారు. అయితే ఆయన సోదరులు,కుటుంబ సభ్యులు ఆయనకు మొదటి నుండి ఎంతో వెన్నుదన్నుగా నిలిచినట్లు రేవంత్ రెడ్డి చెబుతారు.