
హైదరాబాద్, లీడ్స్ న్యూస్ :
వచ్చేనెల 16వ తేదీ లోగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులన్నిటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అధిష్టానంతో కూడా ఈ విషయం చర్చించినట్లు పార్టీ వర్గాల్లో టాప్ నడుస్తుంది. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ విషయం చర్చించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఎవరెవరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు.? వారి సేవలు ఏంటి? అనే అంశంపై ఓ రిపోర్టు తీసుకోవాలని కూడా పార్టీ భావిస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్షులతో ఈ విషయం చర్చించి క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్న వారి జాబితాను ఇప్పటికే సేకరించినట్లు కూడా తెలియవచ్చింది. ప్రభుత్వం ఏర్పాటయి రెండు సంవత్సరాలు దాటినా నామినేటెడ్ పదవులపై ఊరించడం పట్ల కార్యకర్తల్లో ఓకేంత నైరాష్ట్యం నెలకొంది. అందువల్ల వెంటనే నామినేటెడ్ పదవులన్నింటిని భర్తీ చేసి క్యాడర్లో కొంత జ్యోష్ నింపాలని కూడా చూస్తుంది. ప్రజా పాలన – ప్రగతి పాలన 90 రోజుల ప్రణాళికలు పూర్తయిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున ఆ లోగా నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేసి ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సామాజిక వర్గాలు,ఇప్పటికే పదవులు పొందిన వారి జాబితా, పార్టీ అధికారం ఉన్నా లేకున్నా పార్టీని అంటి పెట్టుకొని ఉండి, పార్టీ లైన్ లో నడుస్తున్న వారందరికీ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనలు ప్రభుత్వ ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు పార్టీ ఎమ్మెల్యేలు లేని జిల్లాల్లో కొన్ని పదవులు ఇస్తే పార్టీ కాస్త బలపడే అవకాశం ఉన్నందున ఆ కోణంలో కూడా సర్వే నిర్వహించి తగిన సమాచారాన్ని పార్టీ ఇప్పటికే సేకరించి పెట్టినట్లు కూడా సమాచారం. చూడాలి మరి ఏ జిల్లాల్లో ఎవరెవరికి పదవులు దక్కుతాయి అన్నది. మరో 20 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.