teluguleads.in
Newspaper Banner
Date : 30 March 2026, 7:57 pm Posted By : TELUGU LEADS

కార్యదర్శిపై చర్యలు తీసుకోండి

నర్మెట గ్రామ కార్యదర్శి కందగట్ల శ్రీధర్

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లుగా ఒకే గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నర్మెట గ్రామ పంచాయతీ కార్యదర్శి కందగట్ల శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదే గ్రామానికి చెందిన పులి రేణుక కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే…పనుల కోసం పంచాయతీ కార్యాలయానికి వెళితే కార్యదర్శి సకాలంలో పనులు చేయకపోగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో వాపోయింది. స్థానికుడు అయి ఉండి, నిబంధనలకు విరుద్ధంగా సొంత గ్రామంలో విధులు నిర్వహిస్తూ గృహ నిర్మాణ అనుమతులు,ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వంటి పనుల్లో కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నాడని ఆమె పేర్కొంది. అంతే కాకుండా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి కూడా పాల్పడుతూ, గ్రామాభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. తక్షణమే అతనిపై విచారణ జరిపి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి, చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ ను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సొంత గ్రామంలో పని చేయకూడదని నిబంధన ఉన్న అతను ఎలా విధులు నిర్వహిస్తున్నాడని అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని వాపోయారు. ఇలాంటి కార్యదర్శి పై అధికారులు తక్షణమే చర్య తీసుకుని ప్రజలకు సహకరించాలని కోరారు.