
జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం అక్ష్మిజకంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కార్యాలయంలో అనేక తప్పుడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఈ దాడులకు పూనుకున్నట్లు తెలుస్తుంది. డాక్యుమెంట్ రైటర్లు,కార్యాలయ సిబ్బంది,రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా బదిలీ అయిన సబ్ రిజిస్టర్ కరుణ సహా ఓ రాజకీయ నాయకుడు కలిసి ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి పేరుతో తప్పుడు ఆధార్ కార్డులను సృష్టించి లక్షల విలువైన ఆస్తిని ఇతరులకు బదిలీ చేశారు. ఆ తరువాత అదే ఆస్తిని మరో ఇద్దరికి కూడా బదిలీ చేసి లింకు డాక్యుమెంట్లను కూడా క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీని రూ.45 లక్షలకు మరో వ్యక్తికి బదిలీ చేయాలని భావించిన తరుణంలో ఈ గుట్టు బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. జనగామ పట్టణంలోని ధర్మకంచ మల్లన్న గుడి వద్ద ఉన్న టీఎన్జీవోస్ కాలనీలో భారతి చంద్రయ్య అనే వ్యక్తికి సంబంధించిన 200 గజాల ప్లాటును వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ ముఠా తప్పుడు ఆధార్ కార్డులను సృష్టించి సదరు ప్రాపర్టీని చేతులు మార్చారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టి కర్త ఎవరు? ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్టర్ ఎందుకు సదరు ప్లాటును డాక్యుమెంట్లు అంత సులభంగా బదిలీ చేశారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇదొక్కటే ప్రాపర్టీని బదిలీ చేశారా? ఇది ఎంత కాలం నుంచి జరుగుతుంది? అధికారులు ఈ ప్లాట్ విషయంలో ఏ మేరకు ముడుపులు తీసుకున్నారు? అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అడ్డగోలుగా అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. అక్రమ దందాకు అలవాటు పడిన అధికారులు ఏకంగా చనిపోయిన వ్యక్తుల పేర్లతో వారి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా ఆధార్,తదితర గుర్తింపు కార్డులను సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఆరోపణలు తరచూ రావడంతోనే సోమవారం విజిలెన్సఅధికారులు దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అక్రమ దందాకు తెరలేపిన సబ్ రిజిస్టర్ రాత్రికి రాత్రి ఇక్కడ నుండి బదిలీ కావడం మరింత అనుమానాలకు తావిస్తుంది. అయితే, దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు కార్యాలయం నుండి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలన్ని బట్టబయలై అవుతాయని భావిస్తున్నారు. ఈ దాడుల్లో వరంగల్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఎఫ్ఆర్ఓగౌతమ్ రెడ్డి,ఎమ్మార్వో లక్ష్మణ్ తదితర అధికారులు ఉన్నారు.
