జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల జేఏసీ సభ్యుల అరెస్టుపై మండిపాటు

జనగామ ప్రతినిధి,(న్యూస్ లీడ్స్): అమరవీరుల సాక్షిగా ప్రజల గొంతు నొక్కేయడం అప్రజాస్వామికమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేయాలను కోరుతూ గురువారం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద ఆందోళన చేపడుతున్న చేర్యాల జేఏసీ సభ్యులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమరవీరుల సాక్షిగా జరుగుతున్న ఈ నిర్బంధకాండ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసే హక్కు ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం జేఏసీ గొంతు నొక్కాలని చూడటం అత్యంత బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో, కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని, నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం చేసిన దీక్షను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం అని నాడు మాట ఇచ్చి, నేడు ఆ హామీని గాలికొదిలేయడం చేర్యాల ప్రజలను వంచించడమే అవుతుందన్నారు. చేర్యాల డివిజన్ ఏర్పాటు విషయంలో తాను శాసనసభ వేదికగా నాలుగు సార్లు విన్నవించినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గన్ పార్క్ వద్ద అరెస్టు చేసిన జేఏసీ నేతలను, విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.