జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రతీ వార్డ్ పరిశుభ్రంగా ఉండాలని, సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్ కి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందుతుందా?. సమయానికి డాక్టర్ లు అందుబాటులో ఉంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
ఎక్స్ రే సేవలను వెంటనే, డయాలసిస్ సేవలను వారం రోజుల్లో అందుబాటులోకి తీసుక రావాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి ని పరిశీలించి
ఇప్పటివరకు ఎంత మేరకు నిర్మాణ పనులు అయ్యాయి? ఇంకా ఏఏ పనులు పెండింగ్ లో ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి ప్రతీ గది నిర్వహణనను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి కార్యాలయ నిర్వహణ మీద,పరిసరాల పరిశుభ్రత మీద మున్సిపల్ కమిషనర్ సూచనలు చేశారు. అనంతరం రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. మధ్యాహ్న భోజన వసతి తీరును అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఆయన దిశా నిర్దేశం చేసి మంచి ఫలితాలు సాధించాలని, ఇందుకు ఉపాధ్యాయులను విద్యార్థినులకు గైడ్ చేయాలని ఆదేశించారు.
