ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ప్రజల భాగస్వామ్యం,సహకారంతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని రాష్ట్ర ఆపరేషన్స్ డిజిపి అనిల్ కుమార్ స్పష్టం చేశారు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అరైవ్.. అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గతంలో యేటా 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, దీని కారణంగా దేశ జీడీపీ 3 శాతం నష్టం జరుగుతోందని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఏడు వేలకు పై ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రజల్లో నేటికీ తగిన మార్పు రావడంలేదని అన్నారు. విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ అతి కఠినంగా ఉంటాయని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వేళల్లో జరిమాలను విధిస్తారని చెప్పారు. కానీ, మన దేశంలో మాత్రం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే నామ మాత్రం జరిమానాలు ఉండడం వల్ల వాహనదారులకు భయం లేకుండా పోతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ప్రజల భద్రత కోసమేనని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబందనాలు పాటిస్తే అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పారు. అరైవ్.. అలైవ్ ముఖ్య ఉద్దేశం వాహన దారుడు స్వీయ రక్ష పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవడమేనని అన్నారు. గత ఆరు నెలలుగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 15 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయని, ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యత భావిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం,సహకారం ఉంటేనే రోడ్డు ప్రమాదలను నివారించగలమని అయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో, అలాగే దేశంలో ఏడాదిలో తొమ్మిది వందల హత్యలు జరుగుచుండగా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం ప్రతి యేటా సుమారు ఎనమిది వేల మందికి పైగా మరణిస్తున్నారని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమని, వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపటం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోగలమని చెప్పారు. అనంతరం డీజీపీ చేతుల మీదుగా డైవింగ్ ప్రతిభ కనబరిచిన పోలీస్, ఆర్టీసీ డ్రైవర్లకు ప్రశంస పత్రాలను అందజేయగా,అలాగే యువతకు హెల్మెట్లు,ఆటో డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేశారు. చివరగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలని సూచిస్తూ హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జనగామ డిసిపిలు రాజమహేంద్ర నాయక్,డిసిపీ అంకిత్ కుమార్,ధార కవిత,అదనపు డిసిపి ప్రభాకర్ రావు,ఏసీపీలు భీమ్ శర్మ,అంబటి నర్సయ్య,సత్యనారాయణ, పలువురు సిఐలు, వెస్ట్ జోన్,ట్రాఫిక్ కు ఇన్స్ స్పెక్టర్లు, జిల్లాలోని ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
