teluguleads.in
Newspaper Banner
Date : 03 August 2026, 6:45 pm Posted By : TELUGU LEADS

ప్రజావాణి అర్జీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,లీడ్స్ న్యూస్: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్‌షాలోంతో కలిసి ఆయన ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 326 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు మంజూరు చేయాలని దేవరప్పుల,చిలుపూర్ కుందారం గ్రామాలకు చెందిన మహిళలు విజ్ఞప్తి చేశారు. జనగామకు చెందిన సుకన్య తన 3 ఎకరాల 8 గుంటల భూమిని ధరణిలో నమోదు చేయగా,తన వ్యవసాయ భూమి సర్వే నంబర్లుకు బదులుగా వేరే నంబర్లు నమోదు అయ్యాయని,సరి చేయాలని కోరారు.
నర్మెట్ట మండలం బొమ్మకూరు గ్రామానికి చెందిన ఆనందం తన తల్లి పేరు మీదున్న భూమి రికార్డు ప్రకారం లేదని, కొంత తగ్గిందని,పాత,కొత్త పాస్ పుస్తకాలను పరిశీలించి మ్యుటేషన్ చేయాలని కోరారు.
ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్,గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్,వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.