teluguleads.in
Newspaper Banner
Date : 10 March 2026, 10:26 am Posted By : TELUGU LEADS

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్):మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
కలెక్టరేట్లో సోమవారం మహిళలు,పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగ వారు పాల్గొన్నారు. కడియం మాట్లాడుతూ మహిళలు నేడు రాజకీయంగా,సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా భారతదేశంలో సావిత్రిభాయి ఫూలే,దుర్గాబాయి దేశ్ముఖ్ విద్యాలయాలను నెలకొల్పి, బాలికా విద్య కొరకు ఎంతో కృషి చేశారని అన్నారు. భూమి శిస్తును వ్యతిరేకంగా కాకతీయ రాజులకు ఎదురు తిరిగిన ధీరవనితలైన సమ్మక్క-సారక్కలు, భూమికోసం,భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ వంటి వారు మహిళ లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, కోట్లలో వ్యాపారం చేస్తున్న మహిళా సంఘాలు ఉన్నాయని, దేశానికే చాలా గర్వకారణమని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా జిల్లా యంత్రాంగం కృత నిశ్చయంతో పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవస్థను విస్తరించడంతో పాటు మహిళలను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటూ, తల్లులు,శిశువుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని వివరించారు. నిజమైన మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు. మహిళల భద్రత కేవలం వారి సమస్యగా మాత్రమే కాకుండా అందరి బాధ్యతగా భావించినప్పుడే అది ఆచరణలోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులను శాలువాతో వారు సత్కరించి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్గన్పూర్ మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ శ్రీధర్ రావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, డీసీపీఓ రవికాంత్,మిషన్ శక్తి కో-ఆర్డినేటర్ శారద,పలువురు అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.