ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లీడ్స్ ప్రతినిధి,హైదరాబాద్
మహిళల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకొని వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ‘స్టాండ్ ఫర్ విత్ హర్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీద అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని, కుటుంబంలో రేషన్ కార్డు మంజూరు చేసినా మహిళా పేరుమీద ఇస్తున్నామని చెప్పారు. ఇది మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని చెప్పారు. సమాజంలో సగభాగమైన మహిళలు వంటింటి కుందేలు కాకూడదుని,తెలంగాణ ఎకానమీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం చట్టాలు చేస్తే సరిపోదు, వారికి అండగా నిలబడాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా మహిళల కోసం పెట్రోల్ బంక్ లు, ఇచ్చామని, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో నామకరం చేశామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తెలంగాణ తల్లీ విగ్రహం ఏర్పాటు కూడా మహిళల గౌరవమే అని సూచించారు. అనేక రంగాల్లో మహిళలు కీలకమైన పదవుల్లో కలెక్టర్లుగా,ఎస్పీలుగా ఉన్నారని ఇంకా మరింతగా ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో
చీఫ్ సెక్రటరీగా మహిళా అధికారి ఉండేదని మాజీ సెక్రటరీ శాంతకుమారిని గుర్తు చేశారు. పోలీస్ శాఖలో చారు సిన్హాసహా ,అనేక జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. సామాజిక మాధ్యమాలు పెరిగిన తర్వాత మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని వీటన్నింటిని అరికట్టేందుకు మనం వారి పక్కన నిస్సందేహంగా నిలబడాలని,ఆలా నిలబడితేనే మనకు గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో డిజిపి శివధర్ రెడ్డి సినీ హీరో సాయి ధరంతేజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
