teluguleads.in
Newspaper Banner
Date : 25 June 2026, 7:30 pm Posted By : TELUGU LEADS

రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

పారిశుధ్య కార్మికుడు దుర్మరణం

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కర్రే ఎల్లయ్య (58) రోడ్డు దాటుతుండగా హనుమకొండ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగం గా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఒక్కసారి ఢీకొనడంతో ఎల్లయ్య కారు ముందు భాగంలోని బానేట్ పై పడగా కారు డ్రైవర్ కారు నిల్పకుండా అంతే వేగంతో దాదాపు నడి బ్రిడ్జి మీద వరకు దూసుకెళ్లాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎల్లయ్యను బ్రిడ్జి పైన రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. స్థానికులు వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ అతడు కారు నిలపకుండా వెళ్ళిపోయాడు. రోడ్డు ఇరువైపులా బార్కెట్లు ఉండడం, కారు బ్రిడ్జి పై నుండి వెళ్తుండడంతో అతని నెంబర్ ప్లేట్లు గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. స్థానికులు ఈ హృదయ విధారకర ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే మృతి చెందాడు. ఎల్లయ్య  గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య నాగమణి కుమారుడు రాజు,కుమార్తె హేమలత ఉన్నారు. నిరుపేద ఎల్లయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు శవాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా పరారైన కారును గుర్తించ పనిలో పడ్డారు.ఇదిలా ఉంటే బ్రిడ్జికి ఇరువైపులా సిగ్నల్ ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించాలని స్థానికులు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. అయినా పాలకులు దీనిపై దృష్టి సారించకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.

మృతుడు కర్రే ఎల్లయ్య( ఫైల్)