ఫ్లెక్సీల ఏర్పాటుతో రగడ
రాజయను అడ్డుకున్న పోలీసులు

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా చిల్పూర్ మండలం దేవస్థానం వద్ద బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారీ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ రెండు పార్టీల మధ్య శుక్రవారం మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. చిలుపూర్ లోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం పాలకమండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వస్తున్నాడని భావించి చిలుకూరు,రాజవరం, మల్కాపూర్ తదితర గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు కడియంకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బిఆర్ఎస్ శ్రేణులు చిలుపూరు దేవస్థానం చేరుకొని కడియం శ్రీహరిని కలిసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున చిలుపూరు చేరుకొని ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిలుపూరు దేవస్థానానికి బయలుదేరగా ఆయన్ని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది గులాబీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని గొడవ జరగకుండా చర్యలు తీసుకున్నారు. రఘునాథపల్లి సీఐ ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, చిలుపూరు ఎస్సై వేణు సహా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది దేవస్థానం వద్ద మొహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తాడికొండ రాజయ్య చిలుకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కడియం శ్రీహరి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడని, పార్టీ మారలేదని స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చినందున తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వచ్చిన నష్టం ఏముందని ప్రశ్నించారు. కడియం శ్రీహరి పుణ్యమా అంటూ ప్రశాంతంగా నిర్వహించాల్సిన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారం వాయిదా పడిందని విమర్శించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా స్టేషన్గన్పూర్ లో మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ 2026-27 బడ్జెట్ ప్రణాళిక పై సూచనలు చేసి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని పాలకమండలికి దిశా నిర్దేశం చేశారు.

