జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్

జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్ : మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు చిత్తవుతుందని,ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. సోమవారం ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. అంతే కాకుండా కుటుంబాలకు దూరం అవుతూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారని చెప్పారు. వీటి ప్రభావం సమాజంపై ఎంతో పడుతుందన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు,చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్ ఎంచుకోవాలన్నారు.
మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారు సరైన కౌన్సెలింగ్,కుటుంబ సభ్యుల సహకారంతో పునరావాస కేంద్రాల ద్వారా పూర్తిగా కోలుకుని మంచి జీవితాన్ని గడపవచ్చని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల క్రయ విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని,ప్రతి విద్యార్థి తన కుటుంబ సభ్యులు,స్నేహితుల్లో కూడా అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జనగామ సీఎం సత్యనారాయణ రెడ్డి,ఎస్సై చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

