ప్రహరీ గోడ లేకపోవడంతో ఇబ్బందులు

రఘునాథపల్లి,మార్చి13, (లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో ప్రాథమిక పాఠశాల గోడను కూల్చివేసి తిరిగి నిర్మించక పోవడం దారుణని గ్రామ సర్పంచ్ కొర్ర స్వరూప,రాజేందర్ లు అన్నారు. శుక్రవారం వారు పాఠశాల ప్రాంగణంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అయితే గోవర్ధనగిరి నుండి గోపాల్ స్వామి తండా, వేపలగడ్డ తండా, కుసుమబాయి తండా మీదుగా నర్మెట మండలం లోక్య తండా వరకు ఇటీవల 8 కి.మీ బిటి రోడ్డు వేశారు. ఆ సమయంలో రోడ్డు వెడల్పు కోసం పాఠశాల గోడని కాంట్రాక్టర్ కూల్చేశారని వారు తెలిపారు. గోడ లేకపోవడంతో అక్కడ రాత్రివేళ నిత్యం అసాంగిక కార్యకళాపాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. దీనికి తోడు అంగన్వాడీ చిన్నారులు వాహనాలను చూసుకోకుండా రోడ్లమీదకు వస్తున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ప్రహరీ గోడ నిర్మించేలా, నిధులు మంజూరి చేయాలనీ వారు ప్రభుత్వాన్ని కోరారు.
