బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని దేకడం లేదని,మెట్రో రెండవ దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడన్నారు. 71సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ రెడ్డిని దేకడం లేదని విమర్శించారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దేనని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిందని అన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని, ఎల్ అండ్ టి సంస్థపై బెదిరింపులతో ఆ సంస్థ వెళ్లిపోయింది, ఇప్పుడు మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
