స్పీకర్ నిర్ణయంతో అయోమయంలో బిఆర్ఎస్
అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి

హైదరాబాద్,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం క్లీన్ చీట్ ఇచ్చారు. వీరిద్దరూ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంతో బిఆర్ఎస్ పార్టీకి, పిటిషనర్లకు చుక్కెదురయింది. ఇప్పటివరకు కడియం దానంలతో పాటు పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు దశళ వారీగా స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. దానం,కడియంలపై వేటు పడుతుందని అందరూ భావించారు. బిఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు స్పీకర్ కు ఈనెల 12 లోగా తేల్చాలని డెడ్లైన్ ఇచ్చిన సంగతి విధితమే. అయితే వారిద్దరు పార్టీ మారిన ఆనవాళ్లు లేవని స్పీకర్ తేల్చేశారు. కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారని, అది చాలదా? అని బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దానం నాగేందర్ కూడా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇతర అధికార ప్రతినిధులతో కలిసిన ఆధారాలు ఉన్నా వీరు పార్టీ మారినట్లు ఖచ్చితమైన ఆధారాలు లేవని ఫైనల్ గా ఈ ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ఎట్టకేలకు కొట్టి పారేశారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు ఠెరపడింది. అయితే,ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితిలో బిఆర్ఎస్ ఆలోచిస్తుంది. సుప్రీం కోర్టు వరకు ఇప్పటికే వెళ్లి వచ్చిన ఈ కేసు విషయంలో తిరిగి ఎక్కడ ఆశ్రయించాలనే దానిపై సమాలోచనలో బిఆర్ఎస్ పార్టీ ఉంది. ఇదిలా ఉంటే ప్రజాస్వామ్యం పై దాడి అని,ఇది చీకటి రోజు అని కేటీఆర్ ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. బిజెపి ఇప్పటివరకు ఈ తీర్పుపై స్పందించలేదు.

