లండన్ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్ కు రానున్న సీఎం

లీడ్స్,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం నిరాకరించింది. ఆయన పర్యటన నిబంధనలకు అనుగుణంగా లేదని కేంద్రం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడం ధ్యేయంగా తన పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి ఈ పర్యటను ఖరారు చేసుకోగా, అది కేవలం యూకే వరకు మాత్రమే పరిమితం అయింది. ఈనెల 16న ముఖ్యమంత్రి కార్యాలయం యూకే, అమెరికా పర్యటనలకు కేంద్రం అనుమతి కోరింది. అయితే ఇందులో అమెరికా పర్యటన మాత్రం నిరాకరించింది. నిన్న లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు తదితరులు సందర్శించారు. అనంతరం ఆయన హైదరాబాదుకు ఈ నెల 23న తిరిగి రానున్నారు. సాధారణంగా ప్రముఖుల విదేశీ పర్యటనను కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అవసరమైన అనుమతులను కూడా ఆ శాఖ మంజూరు చేస్తుంది. అయితే నిబంధనలు ప్రోటోకాల్ మేరకు మాత్రమే ఈ టూర్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ అందుకు భిన్నంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి వెంట వెళ్లిన అధికారుల బృందం మాత్రం అమెరికా పర్యటనకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో ముఖ్యమంత్రి కొంత విస్మయానికి గురయ్యారు. అయినప్పటికీ కేంద్ర విదేశాంగ నిర్ణయాన్ని గౌరవిస్తూ తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు కూడా తెలిసింది. అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్ కు తీసుకురావాలన్నదే తన సంకల్పం అని, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా హైదరాబాదును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. సీఎం అమెరికా పర్యటన అనుమతి నిరాకరణ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కోణాలతోటే ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతులు నిరాకరించినట్లు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోయారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడం అనేది అభివృద్ధిని అడ్డుకోవడమేనని మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు అన్నారు. దీనికి ప్రతి కౌంటర్ గా రాష్ట్ర బిజెపి చీఫ్ రామచంద్ర రావు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భద్రతాపరమైన ఏర్పాట్లు, ప్రోటోకాల్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుందని గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనలో ఎన్నోసార్లు అడ్డుకుందని ఆయన గుర్తు చేశారు.
