మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జనగామ,లీడ్స్ న్యూస్: ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని దీన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తో కలిసి ఆయన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయం,తాగునీటి లభ్యత,భూగర్భ జలాలు,వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ప్రజలు,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు,త్రాగు నీటిని అందించే ఏకైక ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు అని,ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దేవాదుల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో త్రాగు నీటికి సైతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,అందువల్ల దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్న నీటి నిర్వహణపై సమగ్రమైన వర్కింగ్ మాన్యూవల్ రూపొందించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. దేవాదులలో ఉన్న 10మోటార్లు కనీసం 100 రోజులు నిరంతరాయంగా నడిపించే విధంగా పకడ్బంది చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం జిల్లా ఇంచార్జి మంత్రి అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అధికారి శ్రీ దేవసేన,ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి,రామచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ,నాయుడు రాజేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సహా వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

