హైదరాబాద్ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మే 10 తర్వాత ప్రారంభం కానున్న జనాభా లెక్కల అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉండగా దాన్ని సవరించిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీల విధానాన్ని రద్దు చేసే యోచనలో ఉందని పుకార్లు షికారులు చేసినప్పటికీ అలాంటిదేమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే చివరినాటికి సవరించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఆ తరువాత జూన్ మొదటి వారంలో పాఠశాలలు తెరవకముందు ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
మండలాలు,జిల్లాల విభజన వాయిదా :
మండలాలు, జిల్లాల పునర్విభజనను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు స్పష్టమవుతుంది. 2027 తర్వాత మాత్రమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఒక జిల్లాలోని మండలాలు ఒకే జిల్లాలో ఉండే విధంగా ఒక మండలంలోని గ్రామాలు ఒకే మండలంలో ఉండే విధంగా ప్రభుత్వం సవరణలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే, జిల్లాల పునర్విభజన కేంద్రతో ముడిబడి ఉన్నందున దీనిపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
