రూ. 15.50 లక్షల విలువైన నగలు స్వాధీనం

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన
నిందితుడు కంప విజయ్ ములుగు జిల్లా వెంకటాపురం గ్రామం కాగా, ఇతనితో
పాటు ఇద్దరు జువైనల్స్ను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి సుమారు రూ.15.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం జనగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంచార్జి ఏసీపీ భీమ్ శర్మ వెల్లడించారు. బచ్చన్నపేట గ్రామానికి చెందిన దొంతుల సోమలింగం వ్యాపారి నివాసంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 1,475 గ్రాముల వెండి వస్తువులు,మూడు మోటార్ సైకిళ్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడిపై ఇప్పటికే సుమారు 40 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరు జువైనల్స్ (మైనర్ ఖైదీలు)ను ప్రలోభపెట్టి వారితో కలిసి వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది.
పోలీసుల అప్రమత్తత,వేగవంతమైన దర్యాప్తుతో ఈ భారీ చోరీ కేసును ఛేదించబడటంతో బాధిత కుటుంబానికి ఊరట కల్పించారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు ఏసిపి చెప్పారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ రెడ్డి,ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
