జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

లీడ్స్,జనగామ: ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టరేటులో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి అయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ భావం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణలో భాగంగా కలెక్టరేట్ లో చేపట్టనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు.వివిధ శాఖల తరపున స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రముఖులకు,పుర ప్రముఖులకు, అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలన్నారు. జిల్లా ప్రగతిపై రూపొందించే సందేశం కాపీలను సీపీఓ, డీపీఆర్ఓ సంయుక్తంగా కలిసి తయారు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను విద్యా శాఖ అధికారులు చేపట్టాలన్నారు.జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని,విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని,ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. ఈ సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, కలెక్టరేట్ ఏవో రవి కిరణ్ సహా వివిధ శాఖ ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
