
ఇబ్బందుల్లో ప్రజలు
చోద్యం చూస్తున్న అధికారులు
లీడ్స్,రఘునాథపల్లి: మరీ ఇంత అద్వానమా? అధికారులు పట్టించుకోవడం లేదా? వారంటే వీళ్లకు లెక్క లేదా? రోడ్డుకు అడ్డంగా షాపులు నిర్వహించడం ఏంటి? ఈ బైక్ పాయింట్ నిర్వాహకుల తీరు చూస్తే మాత్రం నిబంధనలను వీరు పూర్తిగా పాతరేసినట్లు స్పష్టం అవుతుంది. వివరాల్లోకి వెళితే.. రఘునాథపల్లి మండల కేంద్రంలో హనుమకొండ నుండి జనగాం వెళ్లే సర్వీస్ రోడ్డులోని మదీనా మసీదు పక్కన బైక్ రిపేర్ పాయింట్ నిర్వాకులు రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ షాపు ఎదుట స్పీడ్ బ్రేకర్లు కూడా సగభాగం కూడా తొలగించి వేశారు. ఇప్పటికే అండర్పాస్ వద్ద నలుగురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా, అధికారులు ఇలాంటి రోడ్డు ఆక్రమణలపై ఎందుకు దృష్టి సారించడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దుకాణదారులు వారి షాపుల ఎదుట ఉన్న ఫుట్ పాతులను అమాంతం ఆక్రమించి ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నారని స్థానికులు అంటున్నారు. రోడ్డు మధ్యలో అడ్డగోలు పార్కింగ్ కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సదరు ఆటోమొబైల్, బైక్ పాయింట్ యజమానులపై స్థానిక పోలీసు, గ్రామ పంచాయతీ అధికారులు దృష్టి సారించి బైక్ రిపేర్ పాయింట్, అప్పో మొబైల్ దుకాణ యజమానులపై చర్యలు తీసుకుని రోడ్డు క్లియర్ చేయాలని పలువురు కోరుతున్నారు.
