ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీని గెలిపించి మరోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ నూతన అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్టేషన్ ఘన్పూర్ కంచుకోట అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కడియం కార్యకర్తలతో అన్నారు. బిఆర్ఎస్, బిజెపిల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. స్టేషన్గన్పూర్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహకారంతో తీసుకురావడం జరిగిందని కడియం అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పుడు నూతనంగా గ్రామ శాఖ అధ్యక్షులు అయిన వారు మెజారిటీగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉన్నవారేనని ఆయన అన్నారు. ఎంపీ కడియం కావ్య కోటా కింద ఐదేళ్లకు ఈ నియోజకవర్గానికి ఇచ్చే నిధులు మూడేళ్ల లోపే తెచ్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకు ముందుగా కడియం పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముందుగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలకు రిజర్వేషన్ల ద్వారా మరిన్ని అవకాశాలు రానున్నాయని, గ్రామస్థాయి నుంచి మహిళలు నాయకత్వ బాధ్యతలు అలవర్చుకోవాలని ఆమె సూచించారు. రాజకీయాల్లో మహిళ భాగస్వామ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా సాగుతున్నాయని ఆమె అన్నారు. భవిష్యత్తులో వరంగల్ కు మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, అవి కీలకము కానున్నాయని ఆమె చెప్పారు. రఘునాథపల్లిలో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం రైల్వే అధికారులతో మాట్లాడతానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పడికే ఇందిర,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, నిడిగొండ పిఎసిఎస్ చైర్మన్ గంగిడి నరసింహారెడ్డి,పార్టీ మండల నూతన కమిటీ సభ్యులు, గ్రామ శాఖ నూతన అధ్యక్షులు వివిధ గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

