వరంగల్ ఎంపీ,దిశ కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య
లీడ్స్ న్యూస్,జనగామ: జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ ఎంపీ,దిశ కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య అదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, అంగన్వాడి,రోడ్లు, పాఠశాలలు,పాడి పరిశ్రమ,మారక ద్రవ్యాల నిషేధం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు పురోగతిపై నివేదిక సమర్పించారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి,అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద మంజూరు చేసిన పనులు మూడు నెలల్లో ప్రారంభం కాకపోతే వెంటనే వాటిని రద్దు చేయాలని, వినియోగించిన నిధులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నవీకరించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో పాడి ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలు అభివృద్ధి సంక్షేమ,కార్యక్రమాల అమలుకు చేస్తున్న కృషిని ఎంపీ,ఎమ్మెల్యే అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోం,ఆర్డిఓలు గోపిరాం,కిరణ్ ప్రకాష్, జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, ఘనపూర్ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జనగామ మున్సిపల్ కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి,స్టేషన్ ఘన్పూర్ కమిషనర్ రాధాకృష్ణ,దిశా కమిటీ సభ్యులు కేసిరెడ్డి మాధవి,బక్క శ్రీనివాస్, కొర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


